కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ఐడి ఓసి మైదానంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులకు మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా, అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఎందరో త్యాగ ధనుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నా మన్నారు. ఆ త్యాగ ధనులందరికీ ఘన నివాళులర్పిస్తున్నా.స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేదని బ్రిటీష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం కాగా, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు మరో భాగం అన్నారు. మన స్వాతంత్ర సమరయోధుల, మేధావుల దూర దృష్టి మరియు ప్రభావవంతమైన చర్యల వల్ల భారత దేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించిందని, భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకుని ఈ నాటికి 77 సంవత్సరాలు పూర్తయినా, తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందన్నారు.
ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచి పోయాయన్నారు. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచు కోవడం మనందరికీ బాధ్యత. ఆదివాసీ యోధుడు కొమరం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యల తో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు ఆశయాల ద్వారా ప్రజలకోసం నిజమైన ప్రజాపాలన అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి , డిసిపి అంకిత్ కుమార్,అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్, ఏసీపీ శుభం, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఆర్డీఓ , పుర ప్రముఖులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


