కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మన తెలంగాణే అని గర్వంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ముందుగా గన్‌పార్క్‌లో అమరుల త్యాగాలకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను కళాబృందాలు ఆలపించగా కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రగా తెలంగాణ ప్రత్యేకత నిలిచిందని, ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ చరిత్ర అంటే కేవలం కాలక్రమం కాదు… అది ఒక పోరాట గాథ. నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా సామాన్యులు ఎగసి పడిన సాయుధ పోరాటం వల్లే ఈ గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాది పడింది. 1948 సెప్టెంబర్ 17 నాడు ప్రజల త్యాగాలతో స్వేచ్ఛా దీపం వెలిగింది. అదే రోజు ప్రజలే రాసుకున్న ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినంగా నిలిచింది.

అదే స్ఫూర్తితో డిసెంబర్ 7, 2023 కూడా మరో చారిత్రక మలుపు తిరిగింది. గత పదేళ్లలో పెత్తందారీతనం, నియంతృత్వపు పాలనతో ప్రజాస్వామ్యం పక్కదారి పట్టింది. అయితే, తెలంగాణ ప్రజలు మళ్లీ పోరాడి, ప్రజలకోసమే పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
ప్రజల ఆకాంక్షలే ప్రమాణం అని చెప్పుకుంటూ, ఈ రోజు పాలన జరుగుతోంది. అహంకారం, బంధుప్రీతి, పక్షపాతం లాంటి వాటికి చోటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ, తప్పు ఉంటే దిద్దుకుంటూ, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం నింపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు వంటి పథకాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. విద్య ఖర్చు కాదు… అది భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడి అని ప్రభుత్వం నమ్ముతోంది.
మహిళా శక్తి తెలంగాణ ప్రగతికి కేంద్ర బిందువుగా మారుతోంది. స్వయం ఉపాధి నుంచి పెద్ద వ్యాపారాల దాకా మహిళలకోసం పలు కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” నినాదం కేవలం నినాదం కాకుండా, కోట్లాది ఆడబిడ్డల జీవితాలను మార్చే శక్తిగా మారుతోంది.
రైతుల సంక్షేమం విషయంలో తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, బోనస్‌లతో రైతుల భుజాలపై ఉన్న భారాన్ని తగ్గిస్తూ, దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి సాధించింది.

హైదరాబాద్ నగరం తెలంగాణ గర్వకారణం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు, మెట్రో విస్తరణ, గోదావరి నీరు, ORR, రీజినల్ రింగ్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ఆ దిశలో బ్లూప్రింట్‌గా నిలుస్తోంది.
డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఈగిల్ వ్యవస్థ, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గెలుచుకున్న ప్రపంచస్థాయి అవార్డు… ఇవన్నీ కొత్త తెలంగాణలో శాసనసత్తా, పరిపాలనా కఠినత్వం ఎలా ఉందో చాటుతున్నాయి.
సెప్టెంబర్ 17, 1948లో మొదలైన తెలంగాణ స్వేచ్ఛా యాత్ర… డిసెంబర్ 7, 2023లో ప్రజా పాలన దిశగా మరొక మెట్టు ఎక్కింది. ఇకపై ప్రజాస్వామ్య దీపం మరింత ప్రకాశవంతంగా వెలిగేలా, ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరేలా పని చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేస్తోంది.


