కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్యదృష్టి వీడియో ఆల్బమ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిన్నారులు సంస్కృత స్తోత్రాలను రాగయుక్తంగా, స్పష్టంగా ఆలపించడం ఎంతో అభినందనీయమని తెలిపారు.
భాష సరిగ్గా పలకలేని ఈ కాలంలో ఇంత శ్రద్ధ, కృషితో పాడటం ఆనందాన్నిచ్చిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని పిల్లలకు ఆశీస్సులు అందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చిన్నారులను ప్రోత్సహించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
ఆల్బమ్‌కి దర్శకత్వం వహించిన నంది శ్రీనివాస్, సంగీతాన్ని అందించిన కె.బి. శర్మ, సంగీత ఉపాధ్యాయురాలు సరళ, వీడియోగ్రాఫర్ లక్ష్మీ గౌతంను అభినందించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు అన్నం రవిచంద్ర సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సింధుశ్రీ, శ్రావణి, తిరుమల, అఖిల, నిత్యశ్రీ, జాహ్నవి, కల్పన, ప్రణయ్, సాయిరామ్, మణిదీప్, అక్షయ్, వరుణ్ తేజ్, మణిరతన్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.


