కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున బకాయిలు రావాల్సి ఉండడంతో, సమస్యల పరిష్కారం కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో పేదవారికి అనేక ఖరీదైన శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి సుమారు రూ. 1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్ చెబుతోంది. తాజాగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం రూ. 140 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందులో రూ. 100 కోట్లు విడుదల చేయగా, మిగతా రూ. 40 కోట్లు త్వరలో ఇస్తామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ మొత్తం బకాయి సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు వెనక్కు తగ్గలేమని చెబుతున్నాయి.
తెలంగాణలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద కుటుంబాలు ఆధునిక వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం 1,835 రకాల వైద్య సేవలు అందిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ, గుండె, కాలేయం, ఎముకలు, కళ్లు, అవయవ మార్పిడి, కేన్సర్, క్రిటికల్ కేర్ వంటి ఖరీదైన చికిత్సలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇటీవలే ఈ పథకంలో చికిత్స పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచింది ప్రభుత్వం. దీని వలన పేదలు ఆర్థిక భారం లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలుగుతోంది.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాలనుకుంటే ముందుగా సమీప ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్రను సంప్రదించాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. అనంతరం వైద్యుడి సూచన మేరకు శస్త్రచికిత్స అవసరమైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి తీసుకోవాలి. సాధారణంగా ఈ అనుమతి 24 గంటల్లో వస్తుంది. ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, భోజనం, వసతి సదుపాయాలు లభిస్తాయి. డిశ్చార్జి సమయంలో 10 రోజుల మందులు, అలాగే రవాణా ఖర్చులకు రూ.100 కూడా ఇస్తారు.
ఇక ప్రైవేటు ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తే, పేద రోగులు భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారానే అందుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఆసుపత్రులకు బకాయిలు చెల్లిస్తే, మళ్లీ సేవలు సాధారణంగా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. లేకపోతే పేదలకు కలిగే ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.


