కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ, సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
హరీష్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా చేసిన పోస్టులో, తెలంగాణలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైందని ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకాన్ని నిలిపివేశాయని, దీంతో పేద ప్రజలు వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఇవ్వకపోవడంతో అనేక ప్రైవేట్ కాలేజీలు బంద్ అవుతున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన భృతి కూడా ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్నీ బంద్ అయిపోయాయని పేర్కొన్నారు.
నిధుల కొరత కారణంగా గ్రామీణాభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. చెత్త ఎత్తే ట్రాక్టర్లకు డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేవని, గ్రామాల్లో పారిశుద్ధ్యం బంద్ అయిందని, ఇది కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని ఎండగట్టారు.
రైతులకు వాగ్దానం చేసిన రుణ మాఫీ అమలు కాలేదని, పంట బోనస్ ఆగిపోయిందని, వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా కూడా బంద్ అయిందని హరీష్ రావు మండిపడ్డారు. పంట పండించాలనుకుంటే అన్నదాతలకు కావలసిన యూరియా కూడా దొరకడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
2 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్, ఎక్కడ చూసినా బంద్, బంద్, బంద్ మాత్రమే కనిపిస్తోందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీ చేతగాని పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, ఇక ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మీ డ్రామాలను బంద్ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హరీష్ రావు ఘాటుగా ఎద్దేవా చేశారు.


