కాకతీయ, దుగ్గొండి: వ్యవసాయ పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మర్రిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కశివోజుల బ్రహ్మం తన వ్యవసాయ భూమిలో గత ఐదు ఏండ్లుగా మిరప పంట వేసి పంట సరిగా దిగుబడి రాకపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లింది.
దీంతో ఫైనాన్స్, ప్రయివేటు అప్పులు, హౌసింగ్ లోన్ ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక ఇబ్బందులకు గురై మనస్థాపంతో సోమవారం ఉదయం పంట చేనుకు నీళ్లు పెడతానని చెప్పి ఇంటి నుండి వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు.
అటుగా వెళ్లిన బ్రహ్మం తమ్ముడు మృతుడి టూత్ బ్రష్ వ్యవసాయ బావిలో తెలియాడుతుండటంతో బ్రహ్మం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించి గ్రామస్తులు, పోలీసుల సహకారంతో వ్యవసాయ బావిలోని నీటిని మోటార్ల సాయంతో తోడుతుండగా బావిలో బ్రహ్మం మృతదేహం బయట పడింది. మృతుడు మెడకు బండ రాయి కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్ తెలిపారు.


