కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఇంజనీరింగ్ డే కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంజనీర్ల కృషి ఎనలేనిదన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని, ఆశయాలను, చేసిన సేవలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. విశ్వేశ్వరయ్య సేవలను ఇంజనీరింగ్ అధికారులు ఆదర్శంగా తీసుకొని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం మోక్షగుండం జయంతి సందర్భంగా విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు హాల్లో ఏర్పాటుచేసిన రక్తదాన శినిరాన్ని కలెక్టర్ ప్రారంభించి రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, టిజిఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


