కాకతీయ, వరంగల్ బ్యూరో : అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్న డిమాండ్‌తో సిఐటియు పిలుపు మేరకు వందలాది అంగన్వాడీలు మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట మహాధర్నాకు దిగారు. ఈ క్రమంలో రాంనగర్ సుందరయ్య భవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుంటూ అరెస్టులు చేసి సుబేదారి, హనుమకొండ, కేయూ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
అయినప్పటికీ అంగన్వాడీలు పోలీసులు ఏర్పాటుచేసిన గేట్లను దాటి మంత్రి ఇంటి ముందుకు చేరుకున్నారు. దీంతో అక్కడ అంగన్వాడీలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. చివరికి అరెస్టైన వారిని విడుదల చేయడంతో ఆందోళన మరింత జోరందుకుంది. ధర్నా సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు. కొత్త జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు.
ప్రీ ప్రైమరీ విద్యను విద్యాశాఖకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్ల ద్వారానే పీఎం శ్రీవిద్యను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీల వేతనాన్ని రూ.18 వేలుగా అమలు చేయాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పనికిరాని మొబైల్ ఫోన్లను 5జీ సదుపాయాలతో భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి కూడా అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు.
కనీస వేతనం రూ.26 వేలుగా ఇవ్వాలని, 13 నెలల క్రితం ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు టి. ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు సుంచు విజయేందర్, బొట్ల చక్రపాణి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వీరగోని నిర్మల, శోభారాణి, రాజేశ్వరి, రమాదేవి, జమున, హైమావతి, రజిత, అనిత, ఉమాదేవి, ఎండి. మైముదా, అంజుమ్, శారద తదితరులు పాల్గొన్నారు.


