కాకతీయ, గీసుగొండ: రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీని అభివృద్ధి చేసుకుందామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలం కేంద్రంలోని పి.ఎస్.ఆర్.గార్డెన్స్‌లో గీసుగొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసి సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిజాయితీ, నిబద్ధత, మన పెట్టుబడి ఆధారంగా పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్‌ను దామెరలో ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. జనాభాలో సగం ఉన్న మహిళలను చైతన్యం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి.
నర్సంపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళా సంఘాలను అభివృద్ధి పరిచా. అప్పట్లో మహిళలు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ప్రతీ కార్యక్రమంలో మహిళా ప్రాధాన్యం ఎంతో ఆవశ్యకమైందని అన్నారు. మహిళలకు నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మహిళలను వృత్తి వ్యాపార పరంగా శక్తివంతంగా మార్చ పోతున్నామని అన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆర్థికాభివృద్ధి, పశు పోషకులకు న్యాయమైన ఆదాయం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ డైరీ స్థాపన ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించుకోవడం, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం, ముల్కనూరు సహకార డైరీ సహకారం పొందడం వంటి దశలను పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆరు మండలాలను కలుపుకొని దామెరలో ఏర్పాటు కాబోతున్న ఈ డైరీ, రాజకీయాలకు అతీతంగా మహిళల సహకారంతో ఉన్నత స్థాయిలో ఎదుగుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం కల్పిస్తే ఏ స్థాయిలో అభివృద్ధి సాధించగలరో పరకాల మహిళా బ్యాంక్ నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, జడ్పీసీఈఓ రాం రెడ్డి,డిపిఎం వరలక్ష్మి,ఏపీడి రేణుకా దేవి,జిల్లా పశు వైద్యాధికారి బాలకృష్ణ,తహసిల్దార్ రియాజుద్దీన్,ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం ఈశ్వర్, మండల సమైక్య అధ్యక్షురాలు గట్టు రజిత, స్వయం సహాయక సంఘాల సీసీలు, సిఏలు, సభ్యురాల్లు పాల్గొన్నారు.


