కాకతీయ, హనుమకొండ : చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల మరణాలు చూసైనా ప్రభుత్వం స్పందించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై. రాంబాబు విజ్ఞప్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదుట జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగానికి చెందిన పార్ట్ టైం అధ్యాపకుడు రమేష్, కేయూ జువాలజీ విభాగానికి చెందిన తిరుపతి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు మరింత పెరిగాయని, దశాబ్ద కాలంగా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి మరణాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల, చేనేత కార్మికుల, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల మరణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు.
అధ్యాపకుల సమస్యలను వినటానికి ముఖ్యమంత్రి కూడా అవకాశం ఇవ్వడం లేదని డాక్టర్ రాంబాబు ఆక్షేపించారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరేందర్ నాయక్, డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ బ్రహ్మయ్య, డాక్టర్ దేవోజి నాయక్, డాక్టర్ బాలు, డాక్టర్ బిక్షపతి, డాక్టర్ కిరణ్, డాక్టర్ కృష్ణ సుమంత్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ కే.వి.ఎస్. నరేందర్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన అధ్యాపకులకు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం శ్రద్ధాంజలి ఘటించారు.


