కాకతీయ, ములుగు ప్రతినిధి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మల్లంపల్లి మండల బీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సంఘం టౌన్ ప్రెసిడెంట్ చీదర సంతోష్, మండల యూత్ ప్రెసిడెంట్ మొర్రి రాజు యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నాయని విమర్శించారు.
విద్యార్థుల పరిస్థితి రోజురోజుకూ అగమ్యగోచరంగా మారుతోందని, విద్యా రంగంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి కూడా లేరని, గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని, విద్యా రంగానికి పూర్వపు ప్రాధాన్యత లేకుండా పోయిందని వారు విమర్శించారు. కార్యక్రమంలో రేనుకుంట్ల సురేష్, చోటు మమ్మద్, మందకొమ్మాలు, కుక్కల సంపత్, కట్ల గణపతి, పెద్ది రాకేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


