కాకతీయ, ములుగు ప్రతినిధి: పూజారుల అంగీకారంతోనే మేడారం గద్దెల ప్రాంతంలో మార్పులు చేపట్టనున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన గోత్రాలు, పూజా ఆచారాల ప్రకారం అమ్మవార్ల పూజారుల అంగీకారం పూర్తయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో మార్పులు చేపడతామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో డీ.పి.ఆర్. సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయకూడదని, భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి మాట్లాడారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు గ్రామాల గుండా రోడ్డు విస్తరణ, డైవర్షన్ రోడ్ల ఏర్పాటు జరుగుతోందని సీతక్క వివరించారు. గత జాతర సందర్భంగా రైతులకు నష్టపరిహారం అందజేశామని, ఈసారి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ములుగు జిల్లా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా నిలిచిందని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ, దట్టమైన అడవులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని సీతక్క చెప్పారు. గద్దెల ప్రాంతంలో చిన్న గద్దెలను మాత్రమే కొంత మార్పిడి చేసే అవకాశం ఉందని, గద్దెలపై రాజకీయం మానుకోవాలని ఆమె సూచించారు.
ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41 మంది రైతులకు నష్టపరిహారం అందజేశారు. ఏకో పార్క్ సమీపంలోని ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ పట్టాలు అందజేశారు. మేడారం ప్రాంతంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎంపీ బలరాం నాయక్ మంత్రి సీతక్కను కోరారు.
సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎంపీ బలరాం నాయక్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


