కాకతీయ, హనుమకొండ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బోధన బకాయిలు, ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేయూ గెస్ట్ హౌస్‌లో సమావేశమైన విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులు మాట్లాడారు. ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపిస్తూ, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1200 కోట్లను తక్షణమే విడుదల చేసి, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక విద్యాసంస్థల బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
కేయూ లో వరుస గొడవలు జరగడం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించి బయటి విద్యార్థులను క్యాంపస్, హాస్టళ్లలోకి అనుమతించవద్దని విద్యార్థి సంఘాలు కోరాయి. జేఏసీ పేరుతో దందాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, త్వరలో కేయూ విద్యార్థి సంఘాలతో చర్చించి కొత్త జేఏసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేగంటి నాగరాజు, రీసెర్చ్ స్కాలర్స్ డి.తిరుపతి, కేతపాక ప్రసాద్, బి.శ్రీదేవి, ఏఐడీఎస్ఓ రాష్ట్ర కన్వీనర్ ఏ.సత్యనారాయణ, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఎస్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయి కుమార్, డీఎస్ఏ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, నాయకులు ఓ.చిరంజీవి, బొక్క ప్రవర్ధన్, సిహెచ్ రాజ్ కుమార్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.


