కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్స్ గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ దిగి వచ్చారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కు పంపిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్ లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారంతో ఈ రైడ్ జరిగింది. ఇక్కడ అదుపులోకి తీసుకున్నవారిలో ఆ దేశవాసులే ఎక్కువగా ఉన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై దక్షిణకొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితులు ద్రుష్ట్యా మా వ్యాపార సంస్థలు యూఎస్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతుంటారు. కొంతకాలం నిపుణులైన కార్మికులను వారు మా దేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. వారి నుంచి మన కార్మికులు ట్రైనింగ్ పొందాలి. లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేం ఆ విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం. మేం వారి నుంచి నేర్చుకుని వారికంటే మెరుగ్గా రాణిస్తామని ట్రంప్ రాసుకొచ్చారు.


