మట్టి, రాతి కోటల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు
అన్యాక్రాంతమవుతున్న కోట్ల విలువ చేసే భూములు
ఆక్రమణలో రైతులు, గుడిసెవాసులు..
బినామీల పేర్లతో రాజకీయ నేతలు
పురావస్తు శాఖ అధికారుల మొద్దు నిద్ర
ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లోని పురావస్తుశాఖ పరిధిలోని కాకతీయుల మట్టి, రాతి కోటల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెండు కోటలను కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. ఏడాదికేడాది ఈ రెండు కోటల భూములను ఆక్రమిస్తూ.. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మట్టి, రాతి కోటల చుట్టూ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న పురావస్తు, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. కాకతీయులు శత్రువుల నుంచి సామ్రాజ్యాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఖిలా వరంగల్ చుట్టూరా ఏడు కోటలను నిర్మించారు.
అందులో ప్రధానమైనవి రాతికోట, మట్టి కోట, పుట్టకోట, జలకోట, కంపకోటలు. కట్ట మైసమ్మ, మొగిలిచర్ల, కనపర్తి తదితర ప్రాంతాల్లో ఉన్న పుట్టకోట ఇప్పటికే పూర్తిగా అన్యాక్రాంతమైంది. శివారు ప్రాంతంలోని రైతులు, కొంత రాజకీయ నేతలు, ఆక్రమించేశారు. ఇక ఖిలా వరంగల్ మట్టి కోట చుట్టూ సుమారు 7.5 కిలోమీటర్ల మేర, రాతికోట చుట్టూ నాలుగు కిలోమీటర్లు కందకాలు తవ్వి చెరువులు కుంటలను ఏర్పాటు చేశారు. రాతి, మట్టి కోటల చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు రాజకీయ నాయకుల కబ్జాతో పేదల కోసం వేస్తున్న గుడిసెలతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి.
1000 సంవత్సరాల చరిత్ర..!
1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుత కట్టడాలు, నిర్మాణాలు, శిల్ప సంపదలు కలిగిన ఖిలా వరంగల్ కోట చుట్టూ గుడిసెలు, బహుళ అంతస్తులను నిర్మిస్తున్నా.. నివారించడంలో పురావస్తు శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. మట్టి కోట అవతల శివనగర్ పక్కన ప్రాంతంలో సీపీఎం , సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో 20 ఎకరాలు, ఏసి రెడ్డి నగర్ లో 10 ఎకరాలు, మైసయ్య నగర్, అలాగే చింతల్ ప్రాంతంలో 20 ఎకరాలు, శంభునిపేట ప్రాంతాలలో గుడిసెలు వెలిశాయి. ప్రభుత్వ స్థలం సుమారు 60 ఎకరాలలో గుడిసెలు వెలిశాయి.
ఖిల్లా వరంగల్ రాతి, మట్టి కోటకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 2010 పురావస్తు శాఖ ఆక్ట్ ప్రకారం పురావస్తు కట్టడాల సమీపంలో 100 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా గుర్తించారు. ఆ తర్వాత 101 నుంచి 200 మీటర్ల ప్రాంతం వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి తీసుకొని ఇల్లు తదితర కట్టడాలను నిర్మించుకోవచ్చు. ఈ నిబంధనలు అమలు కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కోట చుట్టూ ఇల్లు, గుడిసెలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అలనాటి చారిత్రక కట్టడాలు కూడా కాలగర్భంలో కలిసిపోయే దశకు చేరుకున్నాయి.
ఆదేశాలను అటెకెక్కించారు..!
ఓరుగల్లు కోటలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గతంలో వరంగల్ కలెక్టర్‌గా పనిచేసిన గోపి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన పురావస్తు శాఖ అధికారులు ,మున్సిపల్ కమిషనర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఖిలా వరంగల్ కోటలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే కూల్చేయాలని ఆదేశించారు. అలాగే చట్ట ప్రకారం అనుమతులతో నిర్మాణాలు జరిగేలాచూడాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.
పురావస్తు శాఖ అధికారులు ఓరుగల్లు కోటను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై చేద్దాం.. చుద్దాం అన్నట్లుగా అధికారులు వ్యవహరించి మొత్తానికి ఆక్రమణల తొలగింపును అటకెక్కించారు. ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ సత్యశారద అయినా దీనిపై దృష్టి పెట్టి కాకతీయుల సామ్రాజ్యపు ఆనవాళ్లు పూర్తిగా చెదిరిపోకుండా కాపాడాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.


