కాకతీయ, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న అరిగోసకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలే కారణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నివాసంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం కోరినట్లు కేంద్రం 6.12లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించిందన్నారు.
ఇప్పటికే రాష్ట్రం వద్ద 1.76లక్షల యూరియా నిల్వలు ఉందని, అయినా యూరియా కొరత ఏర్పడటం సందేహాలకు తావిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెటుకు తరలించారని ఆరోపించారు. రాష్ట్రానికి సరిపడా నిల్వలు పంపించినారని ముఖ్యమంత్గ్రి తెలుపగా, మంత్రులు మాత్రం ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దే విఫల ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు యూరియా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి తనకు ఆప్తుడని పదేపదే ప్రకటించే ఎమ్మెల్యే విజయరమణారావు నియోజకవర్గంలో రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జీఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్, బొడ్డుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


