కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి ప్రభుత్వం టెండర్ల కోసం మాత్రమే కృషి చేస్తోందని ఆయన ఆరోపించారు. గత రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా పడే దుస్థితి నెలకొన్నా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని, ప్రతి ఏడాదికి సంబంధించి ఆ ఏడాదిలోనే క్లియర్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమైపోయాయని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లకు బకాయిలు తీర్చడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటూ, కమిషన్లు దండుకోవడంలో ఆసక్తి చూపుతూనే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెద్దఎత్తున టెండర్లకు నిధులు కేటాయించగల ప్రభుత్వం, విద్యా రంగానికి మాత్రం గ్రీన్ చానెల్ హామీలు మరిచిపోయిందని హరీశ్ రావు విమర్శించారు.
బకాయిల కారణంగా అనేక విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు తెలిపారు. విద్యుత్, నీటి బిల్లులు చెల్లించలేక కాలేజీలు మూతపడటం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్న వాస్తవాలను ఆయన వివరించారు. బీఆర్ఎస్ హయాంలో డీమానిటైజేషన్, కరోనా వంటి ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయలేదని, తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 20 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని హరీశ్ రావు గుర్తు చేశారు.
ఒకవైపు గురుకులాలను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు ఉన్నత విద్యాసంస్థలను కూల్చివేస్తున్నారు. విద్యా వ్యవస్థను ఈ స్థాయిలో దెబ్బతీసిన ముఖ్యమంత్రి చరిత్రలో చెడ్డపేరు తెచ్చుకుంటారు అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే విద్యా రంగ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.


