కాకతీయ, నల్లబెల్లి: నకిలీ పురుగుమందుల విక్రయంతో పంట నష్టపోయిన రైతు బాధపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
నందిగామ గ్రామానికి చెందిన రైతు ఇస్లావత్ రాజ్ కుమార్, తన మూడు ఎకరాల వరి పంటలో కలుపు నివారణ కోసం స్థానిక ఖాజా మైనుద్దీన్ ఫర్టిలైజర్ షాప్‌కు వెళ్లాడు. ఆయన కోరిన ‘నామిని గోల్డ్’ మందుకు బదులుగా, షాప్ యజమాని హైమద్ పాషా ‘విన్ సూపర్’ అనే మందును బలవంతంగా రూ. 1700కు అమ్మారు. అయితే, పిచికారీ చేసిన తరువాత వరి పంట పూర్తిగా ఎండిపోయింది.
పంట నష్టానికి కారణమైన మందుపై ఫిర్యాదు చేసినా, షాప్ యజమాని కంపెనీ ప్రతినిధులతో కలిసి రైతును సంప్రదించి, నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ, 20 రోజులు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చారు.
రైతు రాజ్ కుమార్ మాట్లాడుతూ, “నాకైన నష్టం ఇంకొక రైతుకు జరగకూడదు. నకిలీ మందులు అమ్మే ఫర్టిలైజర్ షాపును సీజ్ చేసి, యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి,” అని డిమాండ్ చేశారు.
ఈ రాస్తారోకోలో విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల నరేష్, బట్టు సాంబయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. నిరసన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు కోరారు.


