కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడారు. దీంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తూ, “నేను అధ్యక్షత వహిస్తున్న సమావేశం ఇది. మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి” అని సూచించారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి దినేశ్ వెంటనే స్పందించారు. ఆయన, “లోక్‌సభలో మీరు స్పీకర్ మాటను గౌరవిస్తున్నారా? అయితే ఇక్కడ నేను మీ మాట ఎందుకు గౌరవించాలి?” అని ప్రతివాదం చేశారు. ఈ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. సమావేశంలో ఉన్న ఇతర సభ్యులు పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, దినేశ్ ప్రతాప్ సింగ్ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తమదైన కోణంలో ఈ ఘటనను ప్రచారం చేస్తున్నారు.
In the DISHA meeting, LoP Rahul Gandhi ji humbled down BJP minister Dinesh Pratap Singh.
The meeting, chaired by Rahul Gandhi ji was attended by MPs and MLAs from Amethi and Rae Bareli, including Singh. pic.twitter.com/tXzJSWovAg
— India With Congress (@UWCforYouth) September 12, 2025
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం బీజేపీ మంత్రిగా ఉన్న దినేశ్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన నేత. ఆయన 2022లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో విజయం సాధించి, యూపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో, రాహుల్ గాంధీతో ఆయన మాటల యుద్ధం మరింత చర్చనీయాంశమైంది.
రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం తెలిసిందే. దిశా సమావేశం కూడా అభివృద్ధి పనుల సమీక్ష కోసం ఏర్పాటు చేశారు. కానీ, మధ్యలో జరిగిన ఈ వాగ్వాదం కారణంగా అసలు అజెండా పక్కకు పోయింది. ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉన్న ఉద్రిక్తతను బయటపెట్టింది. బీజేపీ నుంచి వచ్చిన సవాళ్లను రాహుల్ గాంధీ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


