కాకతీయ, గీసుగొండ: లంబాడీలు గిరిజనులు కాదని వారిని గిరిజన జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న అసత్య ప్రచారం సరికాదని బంజారా నాయకులు మండిపడ్డారు. మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి మినీ ఫంక్షన్ హల్‌లో శుక్రవారం రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో బానోత్ రాఘవేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. బానోత్ రాఘవేంద్ర మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే దేశ మూల నివాసులని, స్వాతంత్ర్యం రాకముందే గిరిజనులుగా గుర్తింపు పొందామని తెలిపారు. 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చినా, 1931లో నిజాం ప్రభుత్వం చేపట్టిన కులగణనలో గిరిజనులుగా గుర్తింపు పొందామని ఆయన గుర్తు చేశారు.
కేలోత్ స్వామి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో లంబాడిలు గిరిజన జాబితాలో చేర్చబడ్డారని వివరించారు. రేవంత్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పాటు గిరిజన జాబితాలో చేర్చకపోవడం ఘోరమైన అన్యాయం అని ఆరోపించారు.
అనంతరం 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రాంత లంబాడిలకు గిరిజన హోదా కల్పించిందని తెలిపారు.ఇక ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలంటూ పిటిషన్ వేశారని,ఇది లంబాడి సమాజానికి ద్రోహమని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ చర్య కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమేనా అనే ప్రశ్న లంబాడి సమాజంలో తలెత్తిందని నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బోడ హరి నాయక్ మాట్లాడుతూ లంబాడిల గిరిజన హోదాను కాపాడే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.
ఈ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య నిమ్మ నాయక్, వాంకుడోత్ తిరుపతి, కేలోతు బిక్షపతి, బాధావత్ కృష్ణ, మోతిలాల్, ఆంగోత్ స్వామి, బాదావత్ గణేష్, భూక్య సింహాద్రి రాజేందర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


