కాకతీయ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి పదవిలో ఉన్న జూపల్లి, వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందో లేదో, తానే మళ్లీ గెలుస్తానో లేదో తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు.
జూపల్లి మాట్లాడుతూ .. నేను హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. నేను మళ్లీ గెలుస్తానో లేదో కూడా చెప్పలేను. అందుకే ఎలాంటి వాగ్దానాలు చేయను. కానీ నా వంతుగా కష్టపడి పని చేస్తాను. నా నియోజకవర్గ ప్రజలకు అవసరమైన పనులు చేస్తాను అన్నారు.
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే తన లక్ష్యమని, అప్రయోజక వాగ్దానాల కన్నా ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులపైనే దృష్టి పెడతానని జూపల్లి స్పష్టం చేశారు.
మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బహిరంగంగా “మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు” అని చెప్పడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, అభివృద్ధి పనులను ప్రదర్శించాల్సిన సమయం ఇది అని చాలామంది అభిప్రాయపడుతుండగా, జూపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపై, తన భవిష్యత్తుపై అనిశ్చితి వ్యక్తం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది నిజాయితీగా మాట్లాడిన మాట అని చెబుతుండగా, మరికొందరు ఇది పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


