కాకతీయ, నేషనల్ డెస్క్: భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్య నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అవసరమయ్యాయి. ఎన్డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్ రంగంలోకి దిగగా, ప్రతిపక్షం తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంచనాల ప్రకారమే ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు తాత్కాలికంగా అప్పగించారు.
సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. బీబీఏ పట్టభద్రుడైన ఆయన విద్యార్థి దశలో టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్‌లపై ఆసక్తి చూపారు. భారత మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రేరణతో ఆయన తల్లి తన కుమారునికి రాధాకృష్ణన్ అనే పేరు పెట్టారు.
రాధాకృష్ణన్ 16వ ఏట నుంచే ఆర్ఎస్సెస్, జనసంఘ్‌లతో అనుబంధం కలిగి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1998, 1999లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుండి 2007 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ కాలంలో 93 రోజులపాటు 19,000 కి.మీ. రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం నిర్మూలన, ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలు చేపట్టారు.
2014, 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. 2023లో తొలిసారి ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులై, తరువాత తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులై, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఎంపీగా ఉన్న సమయంలో రాధాకృష్ణన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ-జౌళి చైర్మన్‌గా, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ కమిటీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వంటి పలు కీలక కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2004లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి బృందంలో భాగమయ్యారు. తైవాన్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా పాల్గొన్నారు. 2016–2020 మధ్యకాలంలో కాయిర్-కొబ్బరి పీచు బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2020లో కేరళ BJP వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులై 2022 వరకు సేవలందించారు. సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తి. ఆయనకు ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్. వెంకటరామన్ ఈ గౌరవాన్ని పొందారు. ప్రస్తుతం దేశ రెండవ అత్యున్నత పదవికి ఎన్నికై ఆయన కొత్త అధ్యాయం ప్రారంభించారు.


