కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఖైదీల్లో పరివర్తన తీసుకురావడమే జైళ్లశాఖ సాధించే అసలైన విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. జైలు పరిపాలన అనేది కేవలం భద్రతకే పరిమితం కాకుండా, సంస్కరణ, పునరావాసానికి కూడా సాధనమని అన్నారు. ఈ దిశలో స్వచ్ఛత ,ఆరోగ్యం, విద్య, క్రీడలు లేదా కళలు వంటి పోటీలను నిర్వహిస్తూ జైళ్ల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు.
తెలంగాణ జైళ్ల శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూ ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా 7వ ప్రిజన్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ , డైరెక్టర్ జనరల్ ఆలోక్ రంజన్, అదనపు డైరెక్టర్ జనరల్ రవి జోసెఫ్ లొక్, తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జైలు విభాగాల నుండి పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ మహోత్సవంలో 22 ఈవెంట్ల కోసం మొత్తం 26 ట్రోఫీలు మరియు 40 పతకాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 17 ట్రోఫీలు గెలుచుకుంది. అన్ని పతకాలు మరియు ట్రోఫీలు గెలుచుకున్న వారికి బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతి ప్రదానం చేశారు.
ఈసందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. జైళ్లు భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలోకి వచ్చే అంశమన్నారు.. ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2022 ప్రకారం దేశంలో మొత్తం 1330 జైళ్లు ఉన్నాయి. అందులో 148 సెంట్రల్ జైళ్లు, 428 జిల్లా జైళ్లు, 574 సబ్ జైళ్లు, 91 ఓపెన్ జైళ్లు, 42 ప్రత్యేక జైళ్లు, 34 మహిళా జైళ్లు, 10 బోర్స్టల్ పాఠశాలలు మరియు 3 ఇతర జైళ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలోని జైళ్ళలో సుమారు 5.73 లక్షల మంది ఖైదీలు ఉన్నారన్నారు.
నేటి రోజుల్లో జైలు పరిపాలన అనేది కేవలం భద్రతకే పరిమితం కాకుండా, సంస్కరణ మరియు పునరావాసానికి కూడా సాధనంగా ఉండాలన్నారు. సమాజంలో తిరిగి చేరబోయే ప్రతి ఖైదీ జీవితంలో మార్పు తీసుకురావడమే అసలైన విజయంగా పరిగణించాలన్నారు. ఈ దిశలో మీరు చేస్తున్న ప్రశంసనీయమైనదని జైళ్లశాఖ అధికారులను కొనియాడారు.


