కాకతీయ, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యసాధన పట్ల అవగాహన కల్పించే ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం సిరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, రజనీ దేవి దంపతులు, ప్రిన్సిపాల్ విజయ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక, సైకాలజిస్ట్ తిరునగరి శ్రీహరి, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మాధం మహిపాల్, మోటివేషనల్ స్పీకర్ నరహరి నాయక్ లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం మోటివేటర్లు ప్రసంగిస్తూ విద్యార్థులు కలలు కనడంలో భయపడకూడదని, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పారు. వైఫల్యాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, నైతిక విలువలు జీవితంలో అత్యంత ముఖ్యమని తెలిపారు.
విద్యార్థులు భవిష్యత్తులో నాయకులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, దేశ నిర్మాతలుగా ఎదగాలని ఉత్సాహపరిచారు. ఉదయం గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకు, మధ్యాహ్నం గాయత్రి జూనియర్, డిగ్రీ & పీజీ విద్యార్థులకు వేర్వేరుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా, జీవిత స్ఫూర్తి, ధైర్యం కూడా కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.రవీందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.03


