కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వగ్రామమైన చింతమడక ప్రజలు ప్రత్యేక ఆహ్వానం అందించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు ఈనెల 21న జరగనున్న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని కవితను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అని గర్వంగా పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వచ్చి బతుకమ్మ పండుగకు ఆహ్వానించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. చిన్నతనంలో చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇప్పటికీ తన కళ్లముందే నిలుస్తున్నాయని గుర్తు చేసుకున్నారు. ఈ ఆహ్వానం కేవలం పండుగకు పిలుపు మాత్రమే కాకుండా, గ్రామస్థుల ఇచ్చిన ప్రేమ, ధైర్యం, ఆశీర్వాదానికి ప్రతీక అని కవిత పేర్కొన్నారు.
చింతమడక ప్రజలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ బతుకమ్మ ఆడే వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కవిత హాజరుకాబోతున్నందున ఈసారి బతుకమ్మ పండుగ మరింత విశిష్టంగా జరగనుందని గ్రామస్తులు ఉత్సాహంగా తెలిపారు.
బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవితను కలిసిన గ్రామస్తులు బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయ వాతావరణాన్ని సృష్టించారు. వారందరితో కవిత కాసేపు ముచ్చటిస్తూ, గ్రామం పట్ల తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.


