ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని కొండాపురం పెద్ద తండా గ్రామంలో ఓ ఒంటరి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపింది. మృతురాలు బాదావత్ లక్ష్మీ (45)గా గుర్తించారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం లక్ష్మీ భర్త తిరుపతి సుమారు 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, కూతురితో కలిసి జీవనాన్ని కొనసాగించింది. ఐదు సంవత్సరాల క్రితం కూతురు సంగీతకు వివాహం జరిపించింది. అనంతరం తాను ఒంటరిగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక కారులో ముగ్గురు వ్యక్తులు లక్ష్మీ ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారు. వారిని తన బంధువులుగా అనుకుని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. అయితే బుధవారం ఉదయం కూలీ పనికోసం పిలవడానికి వెళ్లిన మహిళ, లక్ష్మీ మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు, తరువాత పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి ఆమె ఇంటికి వచ్చిన వారు హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకుందా..? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై దూలం పవన్ కుమార్ నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కూతురు సంగీత స్పందిస్తూ.. మా అమ్మ గత కొంతకాలంగా ఛాతీ నొప్పితో బాధపడుతోందని, మందులు కూడా వాడుతోందని కూతురు సంగీత తెలిపింది. ఎవరిపైనా అనుమానం లేదని, గ్రామంలో అందరితో ఆమె సత్సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేసింది. లక్ష్మీ మృతికి గల అసలు కారణం పోలీసులు విచారణ పూర్తి చేసిన తరువాతే తేలనుంది.
ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


