మేడారంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: వచ్చే జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలో సీఎం ఇక్కడ పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంగళవారం జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర లతో కలసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విఐపి పార్కింగ్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో మేడారం మహా జాతర 2026పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లను కేటాయించిందని, వాటితో ఆయా శాఖల అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి సూచనలు మేరకు నూతన హంగులతో శ్వాశతంగా నిలిచిపోయేలా పనులు చేయాలని సూచించారు. జాతరకు సామాన్య పౌరుడి నుండి అనేక మంది ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపి లకు ఇబ్బందులు రాకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. రానున్న మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. సమావేశంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ స్థపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఈ శివనాగిరెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈ ఓ వీరస్వామి, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మేడారంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


