జీపీ కార్యాలయాలే.. ఎరువుల గోదాంలు
పాఠశాలలో యూరియా కూపన్ల కోసం రైతుల లైన్లు
ప్రాథమిక పాఠశాల 3 గంటలకే మూసివేత..
చూసీచూడనట్లుగా అధికారుల తీరు
కాకతీయ, బయ్యారం: గ్రామపంచాయతీ కార్యాలయాలను ఎరువుల గోడౌన్ అడ్డాలుగా వాడుకుంటూ, తమ కార్యకలాపాలను గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. యూరియా కొరత రైతులకే కాక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కూడా శాపంగా మారింది. రెండు, మూడేళ్ల నుండి రైతు సహకార సంఘం సొసైటీ అనుబంధ సెంటర్లను కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం రైతులు యూరియా కోసం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలనందు క్యూ లైన్లు కట్టి కూపన్ల కోసం బారులు తీరడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం 3 గంటలకే బడి గంట కొట్టి ఇంటికి పంపించినట్లు సమాచారం. వారి తల్లిదండ్రులు యూరియా కోసం ప్రభుత్వ పాఠశాలను ఉపయోగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం పక్కనే సొసైటీ నిర్వాహకులు ఓ గదిని గోడౌన్ గా మార్చి యూరియాను నిలువ చేశారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారిని దేవేంద్రచారిని వివరణ కోరగా పాఠశాల నడుస్తున్న సమయంలో రైతులు అక్కడికి వస్తున్న విషయం తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పాఠశాల నడిచే సమయంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ నుండి అనుమతి తీసుకోవాలని, దీనిపై వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. దీనిపై ఎంపీడీవో విజయలక్ష్మిని వివరణ కోరగా ఉప్పలపాడు గ్రామపంచాయతీలో సొసైటీ సబ్ సెంటర్ కోసం పంచాయతీ కార్యాలయ గదిని వాడుకున్నట్లు తమకు తెలియదని తెలిపారు. దీనిపై మహబూబాబాద్ డీపీఓ హరి ప్రసాద్ ను ఫోన్లో వివరణ కోరగా మీటింగ్ లో ఉన్నానని తెలిపారు.
జీపీ కార్యాలయాలే.. ఎరువుల గోదాంలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


