అధికారుల నిఘాలోనే పులి
ట్రాప్ కెమెరాలు, సిబ్బందితో పర్యవేక్షణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, రేంజర్ డోలి శంకర్
కాకతీయ, ములుగు ప్రతినిధి: వారం రోజులుగా ములుగు జిల్లా పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు పాదముద్రలను స్థానికులు గుర్తిస్తున్నారు. జిల్లాలో పెద్దపులి మళ్లీ సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పులి చలనం పలు గ్రామాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం పత్తిపల్లి గ్రామ శివారు పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రేంజర్ డోలి శంకర్ పులి అడుగుజాడలను పరిశీలించి పత్తిపల్లి, చిన్న గుంటూరుపల్లి పరిసరాల్లో పులి సంచరిస్తోందని ధృవీకరించారు. స్థానికులు పులికి హాని తలపెట్టవద్దని, ఎలాంటి కదలికలు గమనించిన వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే పులి పాకాల రిజర్వ్ ఫారెస్ట్ నుండి పత్తిపల్లి ఎదల చెరువు, బుగ్గ చెరువు దాకా తిరుగుతూ కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. తరువాతి రోజుల్లో పులి పులిగుండం, జాకారం, సింగరకుంటపల్లి, తామరచెరువు మీదుగా నర్సాపూర్ పొలాలకు చేరిందని పాదముద్రలు ఆధారంగా అంచనా వేశారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో 20 మంది ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. పులి రామప్ప చెరువు మీదుగా వానలగుట్ట చేరినట్టు అధికారులు గుర్తించారు. అక్కడ గాండ్రింపులు వినిపించడంతో పశువులు భయంతో గ్రామాల వైపు పరుగులు పెట్టాయని పశువుల కాపరులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి కదలికలను ట్రాప్ కెమెరాలు, మానవ వనరుల ద్వారా నిఘాలో ఉంచామని అధికారులు వెల్లడించారు. పులి రక్షణతో పాటు ప్రజల భద్రతకూ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పులి సహజ వాతావరణంలోనే సంచరిస్తోందని, దానికి ఎటువంటి హాని జరగకుండా చూడటం తమ బాధ్యత అని ఎటువంటి హాని జరగకుండా చూడటం మా బాధ్యత ములుగు ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కదలిక గమనించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పులి సంచారాన్ని గమనిస్తుమని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందంతో పులిని పర్యవేక్షిస్తున్నామని ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ములుగులో పెద్దపులి ప్రవేశించినప్పటి నుండి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులిని అనుసరిస్తుమని, ట్రాప్ కెమెరాలతో పులి పాదముద్రల ఆధారంగా పులి సంచరించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పులి భద్రతకు ప్రాధాన్యవిస్తూ స్థానికులు, పశువులు, పశువుల కాపరులను హెచ్చరిస్తూ పులి కదలికలను గమనిస్తూనే ఉన్నామని డీఎఫ్ఓ చెప్పారు.
అధికారుల నిఘాలోనే పులి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


