అయోమయంలో జీపీవో అర్హత పరీక్ష రాయని జూనియర్ సహాయకులు
జీపీవోలుగా సమ్మతిలేని జూనియర్ సహాయకులకు కూడా బాధ్యతలా
వీఆర్ఏ, వీఆర్‌వోల కు ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు ?
కాకతీయ, వరంగల్ బ్యూరో : భూభారతి చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి గ్రామ పాలన అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలో 174 క్లస్టర్లకు గాను 177 మంది జీపీవో పరీక్షలో అర్హత సాధించారు. ఇందులో కొద్దిమంది విముఖంగా ఉన్నారని మరియు కొద్దిమందిని మహబూబాబాద్ జిల్లాకు అలాట్ చేయాలని సిసిఎల్ఏ అప్రూవల్ కొరకు పంపారని సమాచారం. ఇలా చేయడం వల్ల జీపీవో కి విముఖంగా ఉన్న మండలాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఇన్చార్జి జీపీవోగా తీసుకునే అవకాశం ఉంది. జీపీవోగా అర్హత సాధించిన వారికి ర్యాంకు ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నందున వారు ఎంచుకున్న మండలాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న వారికి ఇన్చార్జి జీపీవోగా ఇస్తే సుదూర మండలాలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇలా ఇస్తే వీఆర్ఏగా ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా జీవితాంతం ఉద్యోగ భద్రత లేకుండా పోరాటాలు చేయాల్సిందేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


