కాకతీయ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. అక్కడ జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో సంచలనంగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే తోటి సిబ్బంది ఆమె చేతిలోని డబ్బా లాక్కొని, తహసీల్దార్ సొంత వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు, కల్పన గతంలో మండలానికి చెందిన కొంతమంది బంధువులకు సొమ్ము అప్పుగా ఇచ్చినట్లు, అయితే సంవత్సరాలు గడిచినా తిరిగి ఇవ్వలేదని చెబుతున్నారు. డబ్బులు అడిగిన కారణంగా అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కల్పనపై ఆక్షేపణలు చేస్తూ ఇలాంటి వ్యక్తి నల్లబెల్లిలో ఎలా పనిచేస్తోంది? అంటూ పై అధికారులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన కల్పన, ఆఫీసులోనే ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే చర్చ నల్లబెల్లి మండలంలో జోరందుకుంది. ఆత్మహత్యకు ముందు కల్పన చేతిలో సూసైడ్ కు సంబంధించిన ఉత్తరాన్ని తోటి ఉద్యోగులు గమనించారని, ఆ లేఖ ద్వారా ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే అధికార విచారణ ముగిసే వరకు వేచి చూడాలని పోలీసులు తెలిపారు.


