కాకతీయ, ఆత్మకూర్ : హనుమకొండ – భూపాలపట్నం మార్గంలో ఉన్న జాతీయ రహదారి ఎన్ హెచ్ – 163 ప్రయాణికులకు శాపంగా మారింది. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఈ రహదారి పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా కటాక్షపూర్ చెరువు మత్తడి పైభాగంలో రహదారి గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు ప్రాణభయంతో ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల వర్షాలతో కటాక్షపూర్ చెరువు మత్తడి పైభాగం పూర్తిగా నీటమునిగిపోయింది. నీరు తగ్గిన తర్వాత రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. పెద్ద గుంతలలో నిలిచిన నీటితో వాహన చోధకులు గందరగోళానికి గురవుతున్నారు. రోడ్డు ఎక్కడ ఉందో, గుంత ఎక్కడ ఉందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు.
ఆ రహదారి పై నిత్యం ప్రమాదాలే..
ఈ రహదారిపై రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళల్లో ప్రయాణించే వారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన ప్రమాదాలకు గురవుతున్నారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు గుంతలు గుర్తించలేక వాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒకవైపు వర్షాల వల్ల రోడ్డు మాయమైపోగా, మరోవైపు ఎండలో వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. తమ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు రహదారుల బాగు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రహదారి పరిస్థితి కారణంగా అంబులెన్స్‌లు కూడా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా అత్యవసర వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, గుంతలు పూడ్చి తాత్కాలికంగా అయినా సౌకర్యం కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. రాత్రివేళల్లో ప్రయాణికుల భద్రత కోసం హెచ్చరిక బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


