కాకతీయ, నర్మెట్ట: మండల కేంద్రంలోని వినాయక గార్డెన్లో ఎల్జే ఏసీ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్‌లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎల్జే ఏసీ జిల్లా కన్వీనర్ భానోత్ బిక్షపతి నాయక్, కొర్ర రాజేందర్ నాయక్ హాజరై మాట్లాడారు. ఇటీవల లంబాడ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కుట్రప్రాయమని, బంజారా, కోయ జాతుల మధ్య విభేదాలు తేవడానికి ప్రయత్నమని విమర్శించారు.
9న జరిగే వరంగల్ శాంతి ర్యాలీకి ప్రతీ తండా నుండి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావులను కాంగ్రెస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్వరలో ఛలో ఇందిరా పార్క్ ఉద్యమ కార్యచరణ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్, భూక్య జయరాం నాయక్, ధారావత్ రాజు నాయక్, జూమ్లాల్ నాయక్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


