కాకతీయ, ములుగు : బంజారా, లంబాడీలు ఎస్టీలు కాదని ప్రచారం చేయడం సరికాదని లంబాడ జాయింట్ యాక్షన్ కమిటీ కో-కన్వీనర్ పోరిక రాహుల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ నాయక్ మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ జరుగుతున్న ఈ విష ప్రచారం పూర్తిగా నిరాధారమైనది అని, బంజారా,లంబాడీలు క్రీస్తుపూర్వం నుండే భారతదేశంలో జీవనాధారాలు ఏర్పరుచుకొని ఈ నేలపుత్రులుగా ఉన్నారున్నారు. దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు.
చరిత్రలో దశకుమార చరిత్రలో బంజారాల జీవన విధానం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ‘నాయక్’ బిరుదు, హైదరాలీ కాలంలో సత్కారం, అసఫ్జాహీల కాలంలో గోల్కొండ కోటలో బంజారా దర్వాజ వంటి ఉదాహరణలు లభ్యమవుతాయని తెలిపారు. నిజాం రాజుల కాలంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గోల్కొండ సందర్శన చేసి ఇనాం భూములు పొందిన విషయాన్ని గుర్తు చేశారు.
భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడకముందే మద్రాస్ రాష్ట్రం లంబాడీలను ఎస్టీలుగా గుర్తించిందని, 1976లో 108వ యాక్ట్ ద్వారా రాష్ట్రపతి గెజిట్ ద్వారా తెలంగాణ బంజారా,లంబాడీలను అధికారికంగా ఎస్టీలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. నేడు తెలంగాణ ఎస్టీ జనాభాలో 65% బంజారా, లంబాడీలే ఉన్నారని, 30 లక్షల జనాభాతో రిజర్వేషన్లలో 7% వాటా తమకే వస్తుందన్నారు. ఇది చట్టబద్ధమైన హక్కు అని వివరించారు. తాము ఈ దేశపు గిరిజన పుత్రులం అని, తమ హక్కులు, తమ గౌరవం కాపాడుకోవడమే తమ ధర్మం అని ఆయన స్పష్టం చేశారు.


