కాకతీయ, ములుగు : అడవుల్లోని చెట్లపై కాకుండా, కరెంటు తీగలపై తమ గూళ్ళను కట్టుకున్న పక్షులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ములుగు జిల్లాలో ఏటూరునాగారం అభయారణ్యంలో తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం పరిసరాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా పక్షులు భారీ వృక్షాల్లో, చెట్ల కొమ్మలకు తమ గూళ్ళను కట్టుకోవడం సహజం.
కానీ ఇక్కడి పక్షులు మాత్రం చెట్లకు బదులుగా విద్యుత్ తీగలను ఆశ్రయించాయి. గాలికి ఊగుతూ, వర్షం తట్టుకుని, కరెంటు తీగలపైనే తమ ఆవాసాన్ని ఏర్పరుచుకోవడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. శత్రువుల నుండి రక్షణ కోసం..చెట్లలో గూళ్లు కడితే పాములు, కోతులు, ఇతర జంతువులు వాటిని ధ్వంసం చేస్తాయి. కానీ తీగలపై కడితే ఎవ్వరూ చేరలేరు. కరెంటు తీగలు వారిని రక్షిస్తున్నాయనే భావనతో పక్షులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని పక్షి ప్రేమికులు విశ్లేషిస్తున్నారు.
ఈ గూళ్ళను కట్టినవి బయట పెద్దయ్య పక్షులు (బయా వీవర్ బర్డ్స్). గడ్డి, తాటి తంతువులతో నేసినట్టుగా గూళ్ళను కట్టడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు విద్యుత్ తీగలపై గూళ్ళు కట్టడం ద్వారా తమ తెలివితేటలను మళ్లీ నిరూపించుకున్నాయి. మనుషుల మాదిరిగానే పక్షులు కూడా పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి. ప్రతీ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని ఈ పక్షులు మనకు పాఠం నేర్పిస్తున్నాయి.


