కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెంకటాపురం నుండి నష్కల్ వరకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి రైతుల పక్షాన మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత కడియం శ్రీహరిదని విమర్శించారు.
రైతులు కాలువల్లో నీళ్లు లేక, యూరియా కొరతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదు అని వ్యాఖ్యానించారు. దేవాదుల, ఉప్పుగల్లు, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లపై రీ-ఎస్టిమేషన్ల పేరిట వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా పెంచి పనులు వదిలేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.104 కోట్లతో మూడు ఎత్తిపోతల ప్రాజెక్టులు మంజూరు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేయక రైతులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు.
అలాగే రైతు రాజ్యం కేసీఆర్ హయాంలో వచ్చింది, కాంగ్రెస్ మాత్రం రాక్షస రాజ్యం సాగుతుందన్నారు. కాలువల్లో నీళ్లు పారించింది కేసీఆర్, కమిషన్ల కోసం కాలువలు ఆపింది మాత్రం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం రైతులు కరెంటు కోతలు, సాగునీటి తిప్పలు, యూరియా కొరతలు, వరి ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు, సగం సగం రుణమాఫీతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మండల, గ్రామ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


