కాకతీయ, నెల్లికుదురు: ప్రధానమంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా (పి.యం.శ్రీ) నెల్లికుదురు మోడల్ స్కూల్లో టి.జి.టి సోషల్ బోధిస్తున్న అంజుంసుల్తానా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన సందర్భంగా ఉపాధ్యాయురాలు సుల్తానాకు అభినందనలు తెలిపారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, తోటి సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యలో నూతన సృజనాత్మక పద్ధతులలో బోధన చేయటం, విద్యార్థులకు మోటివేషనల్ గైడ్ గా వ్యవహరించటం, స్టేట్ రిసోర్స్ పర్సన్ గా సబ్జెక్టు పరమైన అన్ని శిక్షణ తరగతులకు హాజరై, ట్రైనీగా వ్యవహరిస్తూ, తెలుసుకున్న విషయాలను పాటిస్తూ బోధించటం, విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నందుకు గాను ఈ అవార్డును దక్కించుకున్నారన్నారు.
పాఠశాల సర్వతోముఖాభివృద్ధిలోనూ, విద్యార్ధులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించుటలోను అంజుంసుల్తానా పాత్ర ప్రముఖమైనదని కొనియాడారు. జిల్లా ఉత్తమఉపాధ్యాయురాలుగా ఎంపికైనందుకు సుల్తానా స్వగృహమైన ఖమ్మం జిల్లాలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, కుటుంబసభ్యులు, స్నేహితులు సుల్తానాను సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివారం సుల్తానా మాట్లాడుతూ ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.


