కాకతీయ, హనుమకొండ : నగరంలోని రాఘవేంద్ర కన్వెన్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రైవేట్ టీచర్స్ ఫెలిసిటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కావ్య, అనంతరం ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారి సంక్షేమానికి రాజీ పడకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత విజయానికి కాకుండా విద్యార్థుల, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రైవేట్ టీచర్లు ఏకమై హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కడియం రామచంద్రయ్య, ఐ ఎన్ టియూ సి నాయకుడు కూర వెంకట్, టిజి ఎస్ పిటియూ ఫౌండర్ ముజీబ్ ఖాన్, ప్రెసిడెంట్ ఫర్జానా తాసీమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


