కాకతీయ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కవితపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కవిత నిజామాబాద్ కు చెడ్డ పేరు తీసుకువచ్చిందంటూ ఫైర్ అయ్యారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి వేదికగా జరగనున్న బీసీ రిజర్వేషన్లపై బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. టీపీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రతిపక్షాల భరతం సాధించడానికి ఈ సభ కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కట్టుబడి ఉందని, ఈ సభ ద్వారా కేంద్రం స్పందించాల్సిందేనని ఆయన ఆన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సభ మోడీ, అమిత్ షా దృష్టికి వచ్చేలా, వారిపై ప్రభావం చూపేలా ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు “దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్లాగా మారిపోయారు. బండి సంజయ్ ఉదయాన్నే దేవుళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడుగుతారు. బీసీ రిజర్వేషన్లపై వారు దొంగాట ఆడుతున్నారు అని తీవ్రంగా విమర్శించారు.
అంతేకాదు, బీఆర్‌ఎస్‌పై కూడా మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కవిత నిజామాబాద్‌కు చెడ్డ పేరు తెచ్చారు. కేసీఆర్ కుటుంబం అంతా దోపిడీకి పాల్పడ్డారని, వాటాల పంపకాల్లో తేడాలు రావడం కారణంగా కుటుంబంలో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ చివరగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సమానత్వానికి మారు పేరు, కుల సర్వేలో 56.33శాతం బీసీలు ఉన్నారని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


