కాకతీయ, తెలంగాణ బ్యూరో: గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం ఇటీవల ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా దళితవాడలో గత అయిదు నెలల్లో అసాధారణంగా మరణాలు జరగడం గ్రామస్థులను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 29 మంది మృత్యువాత పడ్డారు. అయితే గ్రామస్థుల వాదన ప్రకారం అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి. యువకులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామంలో పరిస్థితులు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, ఆరోగ్యశాఖ అధికారులు తురకపాలెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కేసులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గ్రామంలో వంట చేయవద్దని, అక్కడి నీరు లేదా ఆహారం వాడవద్దని సూచనలు జారీ చేశారు. కొంతకాలం ప్రభుత్వం వారానికి మూడు పూటల భోజనం సరఫరా చేయాలని నిర్ణయించింది.
గ్రామస్థులు తమ అనుభవాలను పంచుకుంటూ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెబుతున్నారు. నా తల్లి మొదట జ్వరంతో బాధపడింది. తరువాత కిడ్నీ సమస్యలు వచ్చాయని ఆసుపత్రిలో చెప్పారు. చికిత్స చేయించడానికి డబ్బులు సరిపోక చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది అని ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. మరొకరు తమ భర్త వారంలోనే ఆసుపత్రిలో మృతిచెందారని చెప్పారు. చిన్నపిల్లలకూ జ్వరం, కీళ్ల నొప్పులు రావడం, పాఠశాలకు వెళ్లలేకపోవడం వంటి సమస్యలు ఆందోళన పెంచుతున్నాయి.
ఈ మరణాలకు నీటి కాలుష్యం కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒక సమయంలో గ్రామానికి సమీపంలోని ఓ క్వారీ గుంట నుంచి నీటిని సరఫరా చేయడం జరిగిందని, అది కలుషితమై ఉంటుందని మాజీ సర్పంచ్ ఆరోపించారు. అయితే అధికారులు ప్రస్తుతం బోర్‌వెల్ నీటినే వాడుతున్నారని, ట్యాంకులను శుభ్రపరిచారని చెబుతున్నారు.
మరోవైపు మద్యం దుర్వినియోగం కూడా కారణం కావచ్చని స్థానిక ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు భావిస్తున్నారు. చీప్ లిక్కర్ ఎక్కువగా తాగినవారికి ఇప్పుడు ప్రభావం చూపిస్తోందేమో అని ఆయన అన్నారు. అయితే మహిళలు కూడా మరణించిన నేపథ్యంలో ఇది పూర్తి కారణం కాదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
కొంతమంది రోగులకు మెలియాయిడోసిస్ అనే అరుదైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండవచ్చని వైద్యులు అనుమానించారు. ఇది డయాబెటిస్, లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారిలో ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల్లో స్పష్టమైన ఆధారాలు లభించలేదని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. మరణాల వివరాలు ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యం జరిగిందని అంగీకరిస్తున్నాం. నివేదికల ఆధారంగా అసలు కారణాలను బయటపెడతామని అని ఆయన చెప్పారు.


