కాకతీయ, కరీంనగర్ : ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆధునికంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని పారదర్శకంగా సద్వినియోగం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియంను శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురాతన పాఠశాల తరగతులను పక్కనున్న నూతన భవనంలోకి వారం రోజుల్లోగా తరలించాలన్నారు. ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్న డీసీబీ (ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం) కార్యాలయం మరో చోటకు, ఓపెన్ స్కూల్ కేంద్రం సీతారాంపూర్ లోని ఎంపీపీఎస్ పాఠశాల సమీప భవనంలోకి తరలించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సైన్స్ మ్యూజియంలో మినీ ప్లానిటోరియం, డైనోసారోస్, ఇతర సైన్స్ పరికరాలు పరిశీలించారు. పురాతన పాఠశాల భవనాన్ని పూర్తిగా సైన్స్ మ్యూజియానికే కేటాయించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆర్ట్ ఆండ్ క్రాఫ్ట్స్ కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, విద్యార్థుల కోసం సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించకుండా సకాలంలో మరమ్మత్తులు చేపట్టి పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ , జిల్లా సైన్స్ అధికారి జైపాల్, అధికారులు ఉన్నారు.


