కాకతీయ, వరంగల్ బ్యూరో : గోవా రాష్ట్రంలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజిటల్ లింగభేదం, మహిళల ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డా. కావ్య మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్‌ఫోన్ వినియోగంలో 13% తేడా ఉందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంకా 405 మిలియన్ల మంది మహిళలు డిజిటల్ ప్రపంచానికి చేరుకోలేదని, భారతదేశంలో 75% మహిళలకు మాత్రమే మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్ వినియోగం కేవలం 35% వరకే పరిమితమైందని వివరించారు. ఈ అసమానతలు మహిళల విద్య, ఆరోగ్య సేవలు, ఆర్థిక స్వావలంబనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
మహిళల శక్తి చరిత్రాత్మక ఉదాహరణలను ప్రస్తావించిన ఆమె, వరంగల్ ప్రాంతంలోని రాణి రుద్రమదేవి నాయకత్వం, సమ్మక్క – సారలమ్మ జాతర వంటి సంఘటనలను గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో మహిళల కోసం అమలవుతున్న 33% రిజర్వేషన్లు, వడ్డీరహిత రుణాలు, రూ.344 కోట్ల రుణాల మంజూరు, ఆరోగ్య సేవలకు రూ.10 లక్షల వరకు సౌకర్యం, ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి పథకాలను వివరించారు.
డిజిటల్ లోపాలను తగ్గించేందుకు తక్కువ ధరలో మొబైల్ పరికరాలు అందుబాటులోకి తేవడం, డిజిటల్ విద్య, మౌలిక వసతులను పెంపొందించడం అత్యవసరమని డా. కావ్య స్పష్టం చేశారు. ఈ సదస్సులో తమిళనాడు ఎంపీ ఆర్. సుధ, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సహా పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.


