కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. ఈ క్రమంలో కీలక నేతలు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హరీశ్ రావు, కేసీఆర్ మధ్య జరిగిన ఈ సమావేశం కూడా అలాంటి పరిణామాల్లో భాగమేనని భావిస్తున్నారు. పార్టీ బలపరిచే దిశగా, కేడర్ ఉత్సాహాన్ని పెంచేలా ఏ విధానాన్ని అనుసరించాలనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
గత కొన్ని వారాలుగా హరీశ్ రావు భవిష్యత్ రాజకీయ పాత్రపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌తో ఆయన భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో కీలక నిర్ణయాలు, భవిష్యత్ వ్యూహరచనలో హరీశ్‌కి ప్రత్యేక పాత్ర కల్పించవచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. కుటుంబంలోనూ, పార్టీ శ్రేణుల్లోనూ సమన్వయం అవసరమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎర్రవల్లి భేటీ కూడా ఈ సమన్వయాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగానే భావిస్తున్నారు. పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు, ముఖ్యంగా కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోవడం, ప్రజల్లో మళ్లీ విశ్వాసం తెచ్చుకోవడం వంటి అంశాలపై కేసీఆర్–హరీశ్ మధ్య చర్చ జరిగి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరీ ముఖ్యంగా కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీపదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.


