కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ఆ యుద్ధాన్ని ఆపడం చాలా ఈజీ అని తొలత భావించానని.. కానీ తర్వాత వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత అది అంత ఈజీ విషయం కాదని తెలిసిందన్నారు. యుద్ధం మొదట్లో త్వరగా ముగుస్తుందని అనుకున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు యుద్ధం మరింత క్షిష్టంగా మారింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు దీనిని త్వరగా పరిష్కరించుకోవడం కష్టతరం చేస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
“24 గంటల్లోనే యుద్ధం ఆపేస్తాను” అని గతంలో తన వాగ్దానం గుర్తు చేసుకున్న ట్రంప్, ఇప్పుడు అది వాస్తవానికి సాధ్యం కాదని అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ యుద్ధంతో విసిగిపోయారని, కానీ శాంతి ఒప్పందానికి ముందుకు రావాలన్న ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు.
కాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లకు పైగా కొనసాగుతోంది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, రెండు దేశాల మధ్య భూవివాదాలు సమస్యను మరింత పెంచేశాయి. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తుండగా, రష్యా వెనకడుగు వేయడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధానికి త్వరగా ముగింపు పలకడం కష్టతరమని ట్రంప్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
అయితే, ఈ యుద్ధానికి పరిష్కారం తప్పక వస్తుందని, కానీ అది తాను ఊహించినంత త్వరగా జరగదని ట్రంప్ అన్నారు. ముగ్గురు నేతలు మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఇటీవల ఒక వేదికపై కలిసిన నేపథ్యంలో, ఈ స్నేహం మరింత కాలం కొనసాగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.


