కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గణపతి ఉత్సవం సందర్భంగా లడ్డూ వేలం ఎప్పటిలాగే విశేష ఆకర్షణగా మారాయి. ప్రత్యేకంగా బండ్లగూడా జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవంలో ప్రసాద లడ్డు వేలం ఊహించని రీతిలో రికార్డు సృష్టించింది. ఆ లడ్డు రూ. 2.32 కోట్లుకు అమ్ముడై, ఈ సీజన్‌లోనే అత్యంత ఖరీదైన గణపతి లడ్డుగా నిలిచింది.
ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల సమయంలో లడ్డూ వేలంపాట ఒక పెద్ద సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈసారి కూడా కీర్తి రిచ్‌మండ్ విల్లా నివాసులు ఎంతో భక్తి, శ్రద్ధలతో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన లడ్డు వేలంలో స్థానిక వ్యాపారులు, భక్తులు పోటీగా పాల్గొన్నారు. బిడ్ మొదట కొన్ని లక్షలతో మొదలై, క్రమంగా కోట్లు దాటింది. చివరికి లడ్డు ధర రూ. 2.32 కోట్లు వద్ద ఫిక్స్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గణపతి మండపాల్లో లడ్డూ వేలం కోట్లు దాటినా, ఈసారి బండ్లగూడా జాగీర్‌లో జరిగిన లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత ఏడాది ఇక్కడ లడ్డూ రూ.1.5 కోట్లు దాటగా, ఈసారి దాదాపు రూ. 80 లక్షలు ఎక్కువగా పెరిగి 2.32 కోట్లకు చేరింది.


