కాకతీయ, వరంగల్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా వరంగల్ లోని ఆకుతోట ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యతోపాటు విలువైన జ్ఞానాన్ని నేర్పించేది గురువులని అన్నారు. గురువుల సేవలు ఎన్నటికీ మరువలేమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని, వారి చేతుల్లోనే విద్యార్థుల, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు.
గతంలో టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉండేదని, ప్రస్తుతం టెక్నాలజీ ఉపయోగించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పిల్లల అటెండెన్స్ తో పాటు ఉపాధ్యాయుల అటెండెన్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల పారదర్శకంగా విద్యాబోధన అందించవచ్చన్నారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ విద్య ఇచ్చిన గొప్ప అవకాశం తోనే ఈ స్థాయికి ఎదిగామని అన్నారు.
కులమతాలకు అతీతంగా విద్య బోధన జరగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీ నియోజకవర్గానికి 25ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డీఈఓ రంగయ్య నాయుడు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


