కాకతీయ, వరంగల్ బ్యూరో : నేరం చేస్తే శిక్ష తప్పదనే భయాన్ని నేరస్థుల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించి ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేనంతగా ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు వరకు వివిధ నేరాల్లో నిందితులకు కోర్టు శిక్షలు విధించడం గర్వకారణమని తెలిపారు.
మొత్తం 16 కేసుల్లో శిక్షలు పడగా, అందులో 6 హత్య కేసుల్లో 5 కేసులకు యావజ్జీవ కారాగారం, ఒక కేసుకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారని చెప్పారు. నాలుగు అత్యాచారం కేసుల్లో 2 కేసులకు జీవిత ఖైదు, మరో 2 కేసులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిందని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసులో 7 ఏళ్ల జైలు, చోరీ, ఇతర కేసుల్లో 3 సంవత్సరాల చొప్పున శిక్షలు పడినట్లు వివరించారు. ఇది ఒక్కరి కృషి ఫలితం కాదని, పోలీస్, ప్రాసిక్యూషన్, కోర్టు సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.
దీంతో బాధితులకు న్యాయం జరుగుతుండగా, పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది అని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ రాములు, డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఏసీపీ డేవిడ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంతోషి, శ్రీనివాస్, వాసుదేవ రెడ్డి, పావని, రాజమల్లా రెడ్డి, దుర్గాబాయి, భరోసా కేంద్ర న్యాయాధికారి నీరజ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, ముసికే శ్రీనివాస్, రవికుమార్, కరుణాకర్, పుల్యాల కిషన్, ఎస్.ఐ నర్సింహరావు, సిసిఆర్‌బి సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


