కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్ శివారులోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో శుక్రవారం ఉదయం చోరి ప్రయత్నం జరిగింది. మహిళల బాత్రూంలను టార్గెట్‌గా చేసుకొని దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. ఓ వ్యక్తి బుర్కా వేసుకొని మహిళతో పాటు బాత్రూంలోకి వెళ్లి, ఒక మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే బాధితురాలు ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న మహిళ బంధువులు ఆ వ్యక్తిని పట్టుకొని చెప్పులతో కొట్టి ఆసుపత్రి సెక్యూరిటీకి అప్పగించారు.
సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు పోలీసులు సమాచారం. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళల బాత్రూంలలోకి పురుషులు బుర్కా వేసుకొని ప్రవేశించడం దొంగతనానికేనా..? లేక అసాంఘిక కార్యకలాపాలకా..? అన్నది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఇంత పెద్ద మెడికల్ కాలేజీలో భద్రతా వ్యవస్థ సరిగా లేకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల భద్రతను కాలేజీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారే ప్రమాదం ఉంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.


