కాకతీయ, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయనపై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూ కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ వసూళ్లలో ఆయన పాత్ర ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ఒక ఎకరా భూమిని రూ.10 లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మారని, భూ కన్వర్షన్ కోసం ఎకరాకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని ఒక వైసీపీ నేత నేతృత్వంలో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. అంతేకాకుండా కొండమోడు ప్రాంతంలోని ముగ్గురాయి వ్యాపారుల నుంచి గత ఐదేళ్లలో సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు చెబుతున్నాయి.
విద్యుత్ శాఖలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కదాన్ని రూ.7 లక్షల ధరకు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం అంబటి రాంబాబు మంత్రిత్వ కాలానికి సంబంధించిందని ఆరోపణలు చెబుతున్నాయి.
ఇక వైసీపీ మాత్రం దీనిని రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు ప్రతీరోజూ జరుపుతున్న మీడియా సమావేశాల వల్ల అసహనం చెంది, ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, టీడీపీ, కూటమి నేతలు మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ హయాంలో అవినీతి చేసిన వారందరికీ విచారణ తప్పదు. ఫిర్యాదులు ఉన్నందువల్లే విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందని వారు చెబుతున్నారు.
అంబటి రాంబాబు కూడా ఇప్పటికే ఆరోపణలపై స్పందించారు. తనపై మోపబడుతున్నవి అసత్య ఆరోపణలేనని, రాజకీయ కారణాల వల్లే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. అయినప్పటికీ, విచారణలో అక్రమాలు నిరూపితమైతే కేసు తీవ్రంగా ముదిరే అవకాశం ఉంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ ఏ దిశగా సాగుతుందో, ఫలితం ఏమిటో అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలంతా దృష్టి సారించాయి.


