కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందంటూ ఆరోపించారు.
ఈ రోజు లండన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా..ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందని ఆ సమయంలో బాహుబలి మోటార్లతో సలుభంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పాలన కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావడం లేదన్నారు.
ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వస్వం అని అన్నారు. ఏ విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయమని తేల్చారు. ప్రజలకు సేవ చేయడం ఎలానో తనకు కేసీఆర్ నేర్పించారని హరీశ్ పేర్కొన్నారు.


